తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు నిన్న ఓ శుభవార్త చెప్పారు. 2024, మార్చిలో ఉగాది పండగ నుంచి మళ్ళీ నంది అవార్డులు ఇస్తామని తెలిపారు. సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తి చేసుకొన్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ కార్యక్రమం నిర్వహించింది. దానిలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి వెంకట్ రెడ్డి ఆయనను సన్మానించి నటసింహ చక్రవర్తి అనే బిరుదు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని మళ్ళీ నంది అవార్డులు ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి వెంకట్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమ వలన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే కాక యావత్ భారత్ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తోందని, కనుక సినీ పరిశ్రమని గౌరవించుకోవడం ప్రభుత్వ ధర్మంగా భావిస్తున్నానని మంత్రి వెంకట్ రెడ్డి చెప్పారు.
ఉగాది నుంచే నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. నంది అవార్డుల ప్రధానంపై చర్చించేందుకు త్వరలోనే సిఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి సినీ ప్రముఖులని ఆహ్వానిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి చెప్పారు.