తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఇవ్వాల రాజేంద్రనగర్ మండలంలో హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని ఐటీ, పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ టి. వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేనా రెడ్డితో కలిసి పరిశీలించారు.
అనంతరం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. గత ప్రభుత్వం ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కావల్సిన మౌళిక వసతుల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ఇది ప్రజలకు తీరని ఇబ్బందులు కలిగించిందని ఆయన ఆక్షేపించారు. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు అందవలసిన న్యాయ సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీపడకుండా అద్భుతంగా హైకోర్టును నిర్మిస్తామని ఆయన తెలిపారు. జనవరిలో గౌరవ ముఖ్యమంత్రిగారు శంఖుస్థాపన చేయనున్న ఈ భవన నిర్మాణం కక్షిదారులకు, న్యాయమూర్తులకు, న్యాయవాదుల అవసరాలకు సరిపడేలా, సకల సౌకర్యాలతో, ఆధునిక పద్ధతుల్లో ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీరాజ్ కార్యదర్శి, శ్రీ. ఎం రఘునందన్ రావు, న్యాయశాఖ కార్యదర్శి రేండ్ల తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హోళికెరితో పాటు ఇతర హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు.