రోడ్ల నిర్మాణంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా, నాణ్యతలో రాజీపడకుండా రోడ్లు నిర్మించి.. ప్రమాదరహిత తెలంగాణ దిశగా విస్తృతంగా పనిచేయాలని.. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో జాప్యం జరగకుండా ప్రతీ ఒక్క ప్రాజెక్టుకు ఒక సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పనులను మానిటరింగ్ చేయాలని అధికారులకు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
సచివాలయంలోని తన ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రిగారు పలు సూచనలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని మాటిచ్చామని అందుకోసం ఇప్పడు చేస్తున్న పనులకంటే మరింత వేగంగా పనులు చేయాలని ఆయన అధికారులకు దిశానిర్ధేశం.
గత ప్రభుత్వంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు ప్రమాదాల్లో చనిపోయేవారని.. అలాంటి పరిస్థితి తలెత్తకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు.
పదిహేను (15) రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు వచ్చే నెల మొదటి వారంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని మరియు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖామాత్యులు నితిన్ గడ్కరీ గారిని ఢిల్లీకి వెళ్లి విన్నవిస్తామని తెలిపారు.
ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రిగారు కూడా ఈ విషయం గురించి ప్రధానికి విన్నవించారని ఆయన తెలిపారు. అంతేకాదు.. ఢిల్లీలో నిర్మించ తలపెట్టిన తెలంగాణ భవన్ కు సంబంధించిన భూమి విషయం కొలిక్కి వచ్చిందని.. రేపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమీషనర్లు ఇద్దరి సమక్షంలో ఎంఓయూ చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఇక రాష్ట్రంలో.. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లు, రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ) ల నిర్మాణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్న గౌరవ మంత్రివర్యులు.. పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బసంత్ నగర్ ఫ్లైఓవర్ రెండు నెలల్లో పూర్తి చేసి, ప్రారంభించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని.. ఎవరైనా నాసిరకమైన పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు వంతపాడి రోడ్డు మెయింటినెన్స్ చేసే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల రోడ్ల మెయింటినెన్స్ లేక గుంతలు పడి ప్రజలు రోడ్లపై ప్రయాణించాలంటే భయపడే పరిస్థితికి వచ్చిందని ఆయన అన్నారు.
ఇక నల్గొండలో నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో ప్రజలకు ఇబ్బందులు కాకుండా గౌరవ మంత్రివర్యులు పలు సూచనలు చేశారు.
గత ప్రభుత్వంలోలా భూనిర్వాసితులకు ఇబ్బందులు కలగకుండా.. తగు జాగ్రత్తలు తీసుకొని వారికి నష్టపరిహారం అందించేలా ప్యాకేజీ రూపొందిద్దామని ఆయన సూచించారు. పట్టణానికి దూరంగా రింగ్ రోడ్డు నిర్మిస్తే నిరుపయోగంగా మారుతుందని.. అలా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా రింగురోడ్డు నిర్మాణం మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన ఆదేశించారు.
హైదరాబాద్ నలుదిశలా నిర్మిస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల గురించి, వరంగల్ పట్టణంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండటంపై ఆరాతీసిన మంత్రిగారు.. పనులను నాణ్యతతో పాటు, వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా ప్రతీ ఒక్క ప్రాజెక్టుకు ఒక సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పనులను మానిటరింగ్ చేయాలని అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేయాలని ఏదైన మార్పులు చేర్పులు ఉంటే తాను సూచిస్తానని చెప్పారు. ఇక నల్గొండ, హైదరాబాద్ లో పాత కలెక్టరేట్ల స్థానంలో కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఎంతమేరకు ఉందన్నది పరిశీలిస్తున్నామని.. అవసరాన్ని బట్టి కొత్త కలెక్టరేట్లను నిర్మిస్తామని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో..
అఖిలపక్షంతో కలిసి శిథిలావస్థకు చేరిన ఉస్మానియా దవాఖానను సందర్శించి.. చేపట్టాల్సిన చర్యలపై నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రిగారికి సమర్పించి తదుపరి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
సమావేశానంతరం గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.. గౌరవ ముఖ్యమంత్రిగారితో ప్రత్యేకంగా సమావేశమై.. రివ్యూ అంశాలను సిఎం గారి దృష్టికి తీసుకెళ్లారు.
గౌరవ మంత్రివర్యులు నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రెటరీ శ్రీమతి విజయేందిరబోయి, ఈఎన్ సీ రవీందర్ రావు, గణపతిరెడ్డి, సీఈలు మోహన్ నాయక్, సతీష్, మధుసూధన్ రెడ్డి, తిరుమల, జయభారతీ, శారదా, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.